Showing posts with label ఆధ్యాత్మిక కథలు. Show all posts
Showing posts with label ఆధ్యాత్మిక కథలు. Show all posts

ప్రేమ మందిరం

వేదవేదాంగాలు చదివిన పండితుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాల్ని ఔపోసన పట్టాడు. ఎంతో శ్రద్ధగా ఎన్నో గ్రంథాల్ని సేకరించాడు. వాటిలోంచి విలువైనవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నాడు. ఆ విలువైనవి కూడా అన్నీ కలిపితే ఒక బరువైన సంచి నిండుగా ఉండేవి. ఎక్కడికి వెళ్లినా ఆ పండితుడు వాటిని మోసుకెళ్లేవాడు. అది చాలా కష్టంగా ఉండేది కానీ ఆయన ఆ సంచిని వదిలి పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఏళ్ల తరబడి శ్రమించి, సాధించిన సంపద అది. ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ పండితుడికి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయింది. తన జ్ఞానం తనకు ఎంతో ఆనందాన్ని వివేకాన్ని ఇస్తోంది. తన అధ్యయనం కావలసినంత పాండిత్యాన్ని ఇస్తోంది. ఎన్నో వాదోపవాదాల్లో తనని విజేతగా నిలిపింది. కానీ ఇవేవీ తనకు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని చూపడం లేదు. దైవసాక్షాత్కారానికి ఇవి ఉపయోగపడడం లేదు. దేవుణ్ణి చూడకుండా ఎంత జ్ఞానముండి ఏమి లాభం? అనుకున్నాడు.
ఆవూరి చివర ఒక గుడిసెలో ఒక సన్యాసి ఉన్నాడని దేవుడి గురించి అతనికి ఎంతో తెలుసునని, అతన్ని దర్శిస్తే సందేహాలన్నీ పటాపంచలవుతాయని ఎవరో చెప్పారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పండితుడికి ఆ సన్యాసిని దర్శిస్తే తనకు మార్గం దొరుకుతుందని ఆశ కలిగింది. ఎప్పట్లాగా తన గ్రంథాల సంచిని నెత్తిన పెట్టుకుని చెమటలు కక్కుకుంటూ ఆ సన్యాసి గుడిసె దగ్గరకి వెళ్లాడు. సన్యాసి ఆ పండితుణ్ణి చూసి ‘ఏమిటా సంచి?’ అన్నాడు. ‘మహా గ్రంథాల సారాంశం’ అన్నాడు. పండితుడు. ‘ఎందుకంత బరువు మోస్తావు? కిందకు దించు’ అన్నాడు సన్యాసి. పండితుడు కష్టపడి కిందకు దించాడు. కానీ ఆ సంచిపై చేయిపెట్టి కూచున్నాడు. సన్యాసి ‘ఎందుకు దానిపై చేయిపెట్టడం? చేయి కూడా తీసెయ్‌…’ అన్నాడు. పండితుడు సత్యాన్వేషి గనక చేయి తేసేశాడు. సన్యాసి ‘నీకేం కావాలి?’ అన్నాడు. పండితుడు ‘నేను దైవాన్ని దర్శించా’లన్నాడు. సన్యాసి ‘నీకు ప్రేమ గురించి తెలుసా? దాని మందిరాన్ని అన్వేషించు. దాన్ని కనిపెట్టు. తరువాత నా దగ్గరకి వచ్చావంటే నీకు దైవాన్ని చూపిస్తాను. అయితే ఆ అన్వేషణలో ఈ గ్రంథాలేవీ నీకు ఉపయోగపడవు’ అన్నాడు. పండితుడు సరేనని ఆ సంచిని సన్యాసి దగ్గరే వదిలేసి వెళ్లాడు. దేన్నయినా వదులుకోవచ్చు. కానీ జ్ఞానాన్ని వదులుకోవడం కష్టం. కానీ ఆ పండితుడు దాన్ని కూడా వదిలి పెట్టి వెళ్లాడు. అతను సాహసి. సంవత్సరం గడిచినా పండితుడు రాకపోయేసరికి అతణ్ణి వెతుక్కుంటూ సన్యాసి వెళ్లాడు.
పండితుడు కనిపించాడు. ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నాడు. ‘ఎందుకు నువ్వు దేవుణ్ణి తెలుసుకోడానికి మళ్లీ రాలేదు?’ అన్నాడు సన్యాసి. పండితుడు ‘స్వామీ! మన్నించండి. మీరు ప్రేమను అన్వేషించమన్నారు. నా హృదయమే ‘ప్రేమమందిరమని’ తెలుసుకున్నాను. దాంట్లోనే నేను దైవాన్ని దర్శించాను . అందుకని నేను మీ దగ్గరకు రాలేదు. నా జ్ఞానం నాకు అవసరం లేదు. ప్రేమస్వరూపులైన మనుషుల్లో దైవాన్ని చూస్తూ గడుపుతున్నాను’ అన్నాడు. సన్యాసి అతని పరివర్తనకు సంతోషించాడు.

మరణం

మరణం అనివార్యం. కానీ మనుషులు దాన్ని జీర్ణించుకోలేరు. మరణమంటే భయపడతారు. మరణమన్నది జీవితంలో భాగంగా స్వీకరించలేరు. అర్థం చేసుకోరు. మనం జన్మించింది మరణించడానికే. మరణమన్నది భూతం కాదు. జీవితంలో జరిగే ఒక సహజక్రియ. అనుబంధాలకు అంటుకున్నవాడు మరణాన్ని చూసి కంపిస్తాడు. అర్థం చేసుకున్నవాడు దాని అనివార్యతను ఆమోదిస్తాడు. పగలు వెళుతుంది. రాత్రి వస్తుంది. జీవితమయినా అంతే. పుడతాం. గిడతాం. కానీ దాన్ని మనుషులు జీర్ణించుకోలేరు. అనివార్యతని ఆమోదించడంలో ఆనందముంది. ఆహ్లాదముంది. జీవితమప్పుడే అర్థవంతమవుతుంది. ఒక సందర్భంలో మహావిష్ణువు శివుణ్ణి కలవాలని వెళ్లాడు. తన వాహనమయిన గరుత్మంతుడిపై వెళ్లాడు. మహావిష్ణువు వాహనం దిగి శివుడి నిలయానికి వెళ్లాడు. గరుత్మంతుడు వెలుపలే ఉన్నాడు. గరుత్మంతుడు ఇటూ అటూ చూశాడు ఎదరుగా ఓ పావురం. భయంతో వణికిపోతుంది. నిస్సహాయంగా నీరుగారిపోతున్నట్లనిపించింది. గరుత్మంతుడికి దాన్ని చూసి జాలేసింది. గరుత్మంతుడు దాని దగ్గరకి వెళ్లాడు. దాన్ని చూసి ”ఏమిటి? ఏమయింది? ఎందుకంతలా వణికిపోతున్నావు? ఎందుకంత భయపడిపోతున్నావు? నేను ఉన్నాను. నువ్వు భయపడాల్సిన పనిలేదు” అన్నాడు. పావురం భయం తగ్గలేదు. వణుకు తగ్గలేదు. అది గరుత్మంతుణ్ణి చూసి ”పక్షిరాజా! నువ్వు గొప్పవాడివి. మహావిష్ణువు అండదండలు నీకున్నాయి. నీకు ఎప్పుడూ ఎట్లాంటి ప్రమాదమూ, భయమూ ఉండదు. నేను సామాన్య పక్షిని. నన్నెవరు రక్షిస్తారు?” అంది.
గరుత్మంతుడు ”ఎందుకు అంతగా భయపడుతున్నావు? నేను నీకు అభయమిస్తున్నాను. నిన్ను రక్షిస్తాను. ఇంతకూ నీకు వచ్చిన ప్రమాదమేమిటి ?” అన్నాడు. పావురం ”స్వామీ! ఇంతకు ముందే మీరు రావడానికి ముందే యమధర్మరాజు శివుడి దర్శనానికి లోపలికి వెళ్ళాడు. వెళుతూ నన్ను చూసి నవ్వాడు. ” ఈరోజు మృత్యువు నిన్ను సమీపించబోతోంది” అన్నాడు. అప్పటినుంచి నాచావు తలచుకుని నేను వణికిపోతున్నాను. యముడే చెబితే ఇక నన్ను ఎవరు రక్షిస్తారు?” అంది.
గరుత్మంతుడు ”నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నీకు అప్పుడే మృత్యువేమిటి? నేను నిన్ను రక్షిస్తాను. ఇక్కడికి వేలమైళ్ల దూరం ఉన్న ‘లోకాలోక’ పర్వతం పైన నిన్ను వదుల్తాను. అక్కడ నీకు ప్రాణభయముండదు” అని పావురాన్ని తన రెక్కలమీద ఎక్కించుకుని వేలమైళ్ల వాయువేగ, మనోవేగాలతో వెళ్ళి కొన్ని క్షణాల్లో దాన్ని అక్కడ వదిలి తిరిగి కైలాసపర్వతం చేరాడు. కాసేపటికి శివుణ్ణి దర్శించిన యముడు బయటకి వచ్చాడు. పిట్టగోడపై పావురం లేదు. యముడు ”ఇక్కడొక పావురం ఉండాలి. ఏమైంది?” అన్నాడు.
”అది ప్రాణభయంతో ఉంటే తీసుకెళ్లి లోకాలోకపర్వతంపైన వదిలాను” అన్నాడు గరుత్మంతుడు. యమధర్మరాజు ”మంచి పని చేశావు. నేను పావురాన్ని ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. వేలమైళ్ల దూరంలో ఉన్న లోకాలోక పర్వతంలో మృత్యువు దీనికోసం ఎదురు చూస్తూంటే ఇక్కడ ఏం చేస్తోందబ్బా! అని ఆశ్చర్యపోయాను” అన్నాడు. మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు.

ఎవడు రాజు?

ఎవడు రాజు?
                                                
ఒక రాజు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రాజ్యాన్ని రక్షించుకునే ఆలోచనల్తో ఆశాంతిగా ఉండేవాడు. ప్రతిమనిషి అధికారం కోసం అర్రులు చాస్తాడు. అందర్నీ బానిసలు చేసుకున్నవాడు అధికారానికి బానిస అవుతాడు. అహంకారంలో అందుకున్న దానిలో స్వర్గముండదు. నరకముంటుంది. దూరం నించీ చూస్తే అది స్వర్గంలా అనిపిస్తుంది. దగ్గరికి వెళితే సింహాసనంలో ముళ్లుంటాయి. రాత్రింబవళ్లు రాజు నిరంతరం ఆందోళనలో గడిపేవాడు. తన మనసుపడే బాధల నుండి విముక్తి పొందాలని తపించేవాడు. ఈ బాధల నించి విముక్తి పొందాలంటే తను చక్రవర్తి కావాలి, అన్ని ఇతర రాజ్యాల్ని ఆక్రమించుకోవాలి. అప్పుడు తనకు ప్రశాంతత దొరుకుతుందేమో అని ఆ పనిలో పడి యుద్ధాలు చేస్తూ పోయాడు.
కాలం గడుస్తోంది. తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నాడు. దాంతోబాటు అతనికి అశాంతి, ఆందోళన పెరుగుతూ పోతున్నాయి. అతను కలలు కంటూ పోతున్నాడు. లేని భవిష్యత్తు కోసం, రాని భవిష్యత్తు కోసం ఆరాటంతో సాగిపోతున్నాడు. అధికారకాంక్ష అతన్లో అశాంతితో బాటు రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. రాజు నడివయస్సు దాటాడు. బలం తగ్గింది. పెద్దవాడయ్యాడు కదా! అందుకోవలసింది మరణమొక్కటే. ఆ ఆలోచనల్తో అతన్లో మరింత గుబులు రేగింది.
మనిషి యవ్వన దశలో ఏ విత్తనాల్ని నాటుతాడో మలిదశలో ఆ పంటనే అందుకోవాలి. అధికారకాంక్ష, ఆధిపత్యం రాజు యవ్వనాన్ని ఆక్రమించుకుని ఉండేవి. ఇప్పుడు పెద్దవాడయ్యాక అవే విషఫలాల్ని అందిస్తున్నాయి. ఎక్కడో మనసు పొరల్లో దిగులు,బాధ ఏదో సాధించాలని తపన,భౌతికమయిన సంపదలతో, సామ్రాజ్యాలతో ఆ తపన మరింత ఎక్కువవుతోంది. కానీ కాంక్షల్ని వదులుకోవడానికి సిద్దంగా లేడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ఆశ అతన్ని చావనివ్వలేదు.ఒక రోజు ఎవరికీ తెలీకుండా ఏకాంతంగా నగరాన్ని వదిలి ఒంటరిగా గ్రామసీమలవేపు వెళ్ళాడు. తనతోబాటు తన ఆలోచనల్ని, ఆరాటాల్ని మోసుకెళ్లాడు. దూరంగా పచ్చికబయల్లో పిల్లంగోవి శబ్ధం వినిపిస్తే అటువేపు వెళ్లాడు. అక్కడ ఆనందంగా ఒక పశువుల కాపరి పిల్లంగోవి ఊదుతూ కనిపించాడు. పశువులు పచ్చిక మేస్తూ ప్రశాంతంగా ఉన్నాయి. రాజు అతన్ని చూసి ”నువ్వు పశువుల కాపరివి. పేదవాడివి. కానీ సామ్రాజ్యాన్ని జయించినంత సంతోషంగా పిల్లంగోవిని ఊదుతున్నావు. ఇంత ప్రశాంతంగా ఆరాటం లేకుండా ఉండడం నీకెలా వీలయింది?” అన్నాడు.
దానికి యువకుడయిన ఆ పశువుల కాపరి ”అయ్యా! నాకు రాజ్యాలు వద్దు. ఇవ్వవద్దని కూడా దేవుణ్ణి కోరుతాను. రాజ్యం లేకుండానే నేను రాజుని. కానీ రాజ్యం వస్తేమటుకు నేను రాజును కాను” అన్నాడు. రాజు ఆశ్చర్యంగా ”నీ మాటల్లో ఏదో అంతరార్థం ఉంది. కానీ నువ్వు రాజును అంటున్నావు. ఏ విధంగా నువ్వు రాజువి!”
పశువుల కాపరి ”అయ్యా! నేను రాజ్యం వల్ల, ఐశ్యర్యం వల్ల రాజుని కాను. స్వేచ్ఛతో, స్వాతంత్య్రంతో రాజునయ్యాను. నేను నేనుగా ఉన్నాను. నా కళ్లతో ఈ మనోహరమయిన ప్రకృతి ఆస్వాదించే వీలు, వెసులుబాటు నాకు ఉంది. హృదయపూర్వకంగా ప్రేమించే నిర్మలత్వం నాదగ్గరుంది. సూర్యుడు రాజుకిచ్చిన కాంతినే నాకూ యిస్తాడు. పూలు రాజుకోసం విచ్చుకున్నట్లే నాకోసం కూడా విచ్చకుంటాయి. వాటిని చూసి ఆనందించిన నా కళ్లు మనసు నాకున్నాయి. కానీ రాజుకు అహంకారంతో వీటిని ఆస్వాదించే సమయముండదు. కారణం అతను రాజ్యకాంక్షలో అన్నీ కోల్పోతాడు. అందువల్ల రాజుకంటే నేనే గొప్పవాణ్ణి” అన్నాడు. పశువుల కాపరి మాటల్తో రాజు అహంకారం అదృశ్యమైంది.

సూర్దాస్ - పాటలతో కృష్ణుని పూజించిన భక్తుడు!

ఒకప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే తపోనిష్ట ఉండాలనీ, కఠినమైన నిబంధనలను పాటించాలనీ, ఉన్నతకులంలో పుట్టి ఉండాలనీ... రకరకాల అపోహలు ఉండేవి. కానీ ఆ అపోహలను పటాపంచలు చేసి భగవంతుడు అందరివాడన్న సూక్ష్మాన్ని చాటిచెప్పిన ఉద్యమం భక్తి ఉద్యమం. ఆట, పాట, స్మరణ, సంగీతం... ఇలా మనసుకి తోచిన ఏ మార్గంలోనైనా భగవంతుని చేరుకోవచ్చునని ఈ ఉద్యమంతో తేలిపోయింది. ఆ భక్తి ఉద్యమంలో ఓ అరుదైన పాత్ర స్వామి సూర్దాస్!
సూర్దాస్ వ్యక్తిగత వివరాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. కానీ ఆయన 15వ శతాబ్దంలో జన్మించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సూర్దాస్ పుట్టుకతోనే గుడ్డివాడని కొన్ని కథలు పేర్కొంటున్నాయి. పుట్టుగుడ్డివాడైన సూర్దాసుని కుటుంబసభ్యులు సైతం ఈసడించుకునేవారట. దాంతో దృష్టికీ, బంధాలకీ అతీతమైన ఆ పరమాత్మ మీద తన మనసుని లగ్నం చేసుకున్నాడు సూర్దాస్. ఒకరోజు తన ఊరిమీదుగా తీర్థయాత్రలకు వెళ్తున్న భక్తుల కీర్తనలు ఆయన చెవిన పడ్డాయి. అలాంటి కీర్తనలలోనే తన మనసుకి సాంత్వన లభిస్తుందని ఆయనకు తోచింది. అంతే! ఇల్లు వదిలేసి ఆ భక్తబృందంలో చేరిపోయాడు.
కీర్తనలు పాడుతూ కృష్ణుని పారవశ్యంలో మునిగితేలుతూ సూర్దాస్ యమునాతీరాన సంచరించేవాడట. అలా ఓ రోజు ఆయన బృందావనానికి చేరుకున్నాడు. కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ఆ బృందావనంలో, సూర్దాస్ అలౌకకికమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ పారవశ్యంలో పాడిన భజనలు అనతికాలంలోనే ఆయనకు ప్రచారాన్ని తీసుకువచ్చాయి. సూర్దాస్ భక్తిని గమనించిన వల్లభాచార్యులవారు అతనిని తన శిష్యులలో ఒకరిగా చేర్చుకున్నారు. తన భక్తికి గురువు కూడా తోడవడంతో సూర్దాస్ కవితా ప్రతిభకు అంతులేకుండా పోయింది.
సూర్దాస్ భక్తి గురించి ఉత్తర భారతంలో చాలా గాథలు వినిపిస్తాయి. ఒకసారి సూర్దాస్ బావిలో పడిపోయాడట. అంతటి ఆపత్కాలంలోనూ ఆయన కృష్ణుని ధ్యానించడం వీడలేదట. సూర్దాసు భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్ముడు స్వయంగా వచ్చి అతడిని రక్షించాడని చెబుతారు. ఆపై సూర్దాసుకి దృష్టి వచ్చే వరాన్ని ఒసగాడట. కానీ కృష్ణుని చూసిన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడలేనంటూ సూర్దాస్ తిరిగి తనకు అంధత్వం ప్రసాదించమన్నాడట.
సూర్దాస్ తన జీవితకాలంలో లక్షపాటలు రాశాడని చెబుతారు. అయితే వాటిలో ఎనిమిదివేలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిలో హిందీతో పాటుగా వ్రజభాష కూడా కనిపిస్తుంది. కృష్ణునితో అనుబంధం ఉన్న వ్రజ భూమిలో అనాదిగా వినిపించే భాషే ఈ వ్రజభాష! బాలకృష్ణుడు పలికిన భాషలోనే బాలకృష్ణుని లీలలను గుర్తు చేసే సూర్దాస్ భజనలు అద్భుతాలు. ‘నేను వెన్న తినలేదమ్మా! ఎవరో నా మొఖానికి వెన్న పూశారు’ అంటూ ఆ వెన్నదొంగని గుర్తుచేసే ‘మై నహీ మాఖన్ ఖాయో!’ వంటి భజనలు సూర్దాస్ రచనలలో అనేకం కనిపిస్తాయి. అలా కృష్ణభక్తిలో మునిగితేలుతూ, పదిమందికీ పంచుతూ వందేళ్లకు పైగా జీవించిన సూర్దాస్ మథుర సమీపంలో తన దేహాన్ని చాలించారని చెబుతారు.
కొన్ని కథల ప్రకారం సూర్దాస్ పుట్టుగుడ్డి కాదు. ఆయన మంచి అందగాడు, ధనవంతుడు. అలాంటి సూర్దాస్ ఒ వేశ్య మోహంలో పడిపోయాడు. ఆమె కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. దివారాత్రులూ ఆ వేశ్య ధ్యానంలోనే గడిపేవాడు. తన తండ్రికి శ్రాద్ధకర్మలను నిర్వహించే సమయంలో కూడా ఎప్పుడెప్పుడు ఆ వేశ్యని కలుద్దామా అని అతని మనసు ఆరాటపడసాగింది. ఆ ఆరాటంతోనే క్రతువుని ముక్తసరిగా ముగించి తన ప్రేయసిని కలుసుకునేందుకు బయల్దేరాడు.
సూర్దాసు ప్రయసిని కలుసుకోవాలంటే ఒక నదిని దాటవలసి ఉంది. కానీ ఆ రాత్రి భీకరమైన వర్షం, హోరు గాలి. అలాంటి వాతావరణంలో, అంత చీకటివేళ నదిని దాటేందుకు పడవవాడు నిరాకరించాడు. దాంతో సూర్దాసు ఒక దుంగను పట్టుకుని ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంతాచేసి అతను పట్టుకుని వచ్చిన వస్తువు దుంగ కాదు శవం అని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రియురాలి మేడని ఎక్కేందుకు ఒక తాడుని పట్టుకుని పై అంతస్తుకి చేరుకుంటాడు. పైకి వెళ్లిన తర్వాత తాను పట్టుకున్నది తాడు కాదనీ పెద్ద పామునని తెలుస్తుంది.
అంత రాత్రివేళ, అలాంటి పరిస్థితులలో, అంత ప్రమాదానికి ఓర్చి తన దగ్గరకు వచ్చిన సూర్దాసుని చూసి వేశ్య ఆశ్చర్యపోతుంది. అతనిలోని మోమపు తీవ్రతను చూసి ఆమెకు కంపరమెత్తిపోతుంది. ‘ఇదే ఆర్తిని ఆ భగవంతుని పట్ల చూపిస్తే నీకు ఆయన దర్శనం లభించి తీరుతుంది కదా!’ అని ఛీదరించుకుంటుంది. ఆ మాటలతో సూర్దాస్ మనసు పరివర్తనం చెందుతుంది. అటుపై ఆయన భగవంతుని ధ్యానంలో మునిగిపోతాడు. అంతేకాదు! ఇకమీదట తన మనసు మరలే అవకాశం లేకుండా గుడ్డివాడైపోతాడు.
కథ ఏదైతేనేం! సూర్దాస్ అనే మహాభక్తుడు ఉన్నాడనీ, కృష్ణుని కీర్తిస్తూ అద్భుతమైన భజనలు రచించాడన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. భక్తి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి హిందూమతానికి పునర్వైభవం రావడానికి సూర్దాస్ కీర్తనలు కూడా ఓ ప్రముఖ పాత్రని పోషించాయి.

దయ్యం భాష

ఒక నౌక సముద్రంలో సాగుతోంది. అది దూర దేశాలు వెళుతోంది. దాంట్లో వివిధ దేశాల ప్రజలు ఉన్నారు. విదేశీయానం పట్ల ఆసక్తి కలిగినవాళ్లు సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడేవాళ్లు, వ్యాపారస్థులు ఎందరో ఉన్నారు. పెద్దలు,పిల్లలు, స్త్రీలు అందరితో నౌక సందడిగా ఉంది. వాళ్లలో ఒక సన్యాసి కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో ధర్మాల్ని అధ్యయనం చేసినవాడు. మనుషుల గురించి బాగా తెలిసినవాడు. ప్రశాంత చిత్తుడు. నౌక అంతా కలకలం నిండి ఉన్నా నిర్లిప్తంగా తన లోకంలో తను వుండేవాడు. ఉదయం సముద్రాన్ని చూస్తూ, దాని గాంభీర్యానికి తలవంచుతూ, ఆకాశాన్ని కలియజూస్తూ, సాయం సంధ్యల్ని పరిశీలిస్తూ కాలం గడిపే వాడు. దూరదేశం నించీ వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడఉపన్యసించడానికి ఆయన వెళుతున్నాడు. ఒక రోజు చీకటి పడబోతుంది. అది ఆయన ధ్యాన సమయం. ఒక మూల ఎవరూ లేని చోటుకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. నౌకలో రకరకాల జనం ఉంటారు. నౌకకూడా లోకం లాంటిదే. ఒక కుర్రాళ్ల గుంపు కూడా ఆ నౌకలో ఉంది. వాళ్ళు ఎప్పట్నించో ఆ సన్యాసిని ఆటపట్టించాలని చూస్తున్నారు. ఒక మూలంగా వెళ్లి సన్యాసి కూచోవడం చూసారు. ఇది సమయమనుకున్నారు. దగ్గరగా వెళ్లారు. సన్యాసి కళ్లు మూసుకుని ఉండడం చూశారు. ఒక కుర్రవాడు పిల్లి కూతలు కూశాడు. సన్యాసి కళ్ళు తెరవలేదు. మరో కుర్రాడు కాగితపు ఉండల్ని సన్యాసిపై విసిరాడు. సన్యాసి పట్టించుకోలేదు. ఇద్దరు కుర్రాళ్లు గంతులువేస్తూ పాటలు పాడారు. సన్యాసి పట్టించుకోలేదు. దాంతో కుర్రాళ్ల అహం దెబ్బతింది. ఒక కుర్రాడు తన చెప్పుతీసి సన్యాసిపై విసిరాడు. సన్యాసి చలించలేదు. ప్రార్థనలో మునిగిపోయాడు.ఇదంతా పైనించీ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఆగ్రహం కలిగింది. వెంటనే”నాయనా! నువ్వు ఒక్క మాట చెబితే ఈ నౌకను తలకిందు చేస్తా! వీళ్లందర్ని ముంచేస్తా!” అన్నాడు. ఆకాశం నుంచీ వినిపించిన ఆ మాటలతో అల్లరిమూక అదిరిపోయింది. అందరూ సన్యాసి పాదాలపై పడి క్షమాపణలు కోరారు. సన్యాసి వాళ్లను ఓదార్చి భయపడవద్దని చెప్పాడు. ఆకాశంలోకి చూసి ”దేవా! దయామయులైన మీరు దయ్యం భాషలో మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కరుణాసింధువయిన నువ్వు ఇంత కఠిన భాషలో మాట్లాడకూడదు కదా! మీరు దేన్నయినా తలకిందులు చెయ్యదలుచుకుంటే నౌకను కాదు. వీళ్ల బుద్దిని తలకిందులు చేయి. నౌకను తలకిందులు చేస్తే అంతా నాశనమవుతుంది. నువ్వు నాశనం చేసే వాడివి కాదు కదా! వెలుగు నింపే వాడివి కదా!” అన్నాడు. ఆకాశంనుంచీ బదులు వినిపించింది.”నాయనా! నువ్వు సత్యం చెప్పావు. నాస్వరంలో తేడాను గుర్తించావు. చాలా సంతోషం. ఎవరైతే దయ్యం భాషను గుర్తించగలరో నా నిజమైన స్వరాన్ని వాళ్లే గుర్తుపడతారు. నువ్వు నా స్వరాన్ని గుర్తు పట్టావు. నా తత్వాన్ని తెలుసుకున్నావు. నువ్వు చెప్పినట్లు నేను వీళ్ళ బుద్ధిని తలకిందులు చేస్తాను” అని దేవుడు ఆ అల్లరిమూకలో పరివర్తన తెచ్చాడు. ఆ కుర్రాళ్లు పశ్చాతాపంతో సన్యాసిని క్షమాపణలు కోరారు. సన్యాసి వాళ్ళని చిరునవ్వుతో ఆదరించాడు. మనసులు నిర్మలంగా మారాయి. నౌక నిశ్చలంగా సాగింది.

ఊర్మిళాదేవి కోరిక ...

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
’14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,’ అని ఎవరో గుర్తుచేశారు.
ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ‘’14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,’ అని అడిగారు.
‘‘మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,’’ అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ‘‘లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!’’ అని పరిహాసంగా అడిగారట రాములవారు.
‘‘అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,’’ అని బదులిచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ‘‘తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!’’ అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ‘‘ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,’’ అని వేడుకుందట ఊర్మిళ.
‘‘కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,’’ అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం.